‘హృదయ కాలేయం’ సినిమా చూసిన ఎంజాయ్ చేసిన వాళ్లు.. ‘కొబ్బరిమట్ట’ ప్రోమోలు చూసి సినిమాలో ఏం ఉంటుందని అంచనా వేస్తారో దాన్నే అందిస్తుంది ఈ చిత్రం. కథ గురించి.. స్క్రీన్ ప్లే గురించి పెద్దగా చర్చించుకునే సినిమా కాదిది. అసలిందులో కథ అని చెప్పుకోవడానికేమీ లేదు. దీనికి ఒక నడత అంటూ ఉండదు. సిచువేషన్ ఏదైనా సరే.. సెటైర్లు స్పూఫులతో ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా సాగుతుందీ చిత్రం. ప్రతి సన్నివేశంలోనూ కావాల్సినంత ‘అతి’ కనిపిస్తుంది. ఏ సన్నివేశం కుదురుగా కనిపించదు. ‘ఓవర్ ద టాప్’ స్టయిల్లో సాగిపోయే సన్నివేశాలు కోకొల్లలు. తమ్ముళ్లు ఎండలో చెప్పుల్లేకుండా నడుస్తూ ఇబ్బంది పడుతున్నారని.. వాళ్లు కాళ్లను భుజాల మీదికి వేసుకుని చేతులతో నడిపిస్తాడు పెదరాయుడు. తన తమ్ముడి జీవితంలో ప్రతి సందర్భంలోనూ తాను తోడుగా ఉన్నానని.. అతను శోభనం జరుపుకుంటుంటే కంగారు పడకుండా తోడుగా ఉందామని చాప-దిండు తీసుకుని గదిలోకి వెళ్లిపోతాడు. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకోమని తండ్రి చెప్పాడు కాబట్టి ఒకే బ్రష్ తో తమ్ముళ్లందరికీ పళ్లు తోమిస్తాడు పెదరాయుడు. చెల్లెలికి పొయ్యి దగ్గర చేయి కాలిందని.. మిగతా అందరికీ కూడా వాతలు పెడతాడు. నువ్వెందుకు వాత పెట్టుకోలేదన్నయ్యా అంటే.. మీ బాధ నా బాధ కాదా అంటాడు. సినిమా అంతటా ఇలాంటి సన్నివేశాలే ఉంటాయి.

తెలుగు సినిమాల్లో మితిమీరిన హీరోయిజం.. నాటకీయతపై సెటైర్లు స్పూఫులతో సాగిపోయే సినిమా ‘కొబ్బరిమట్ట’. ఈ టైపు సినిమాల్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్లను సినిమాలోని కొన్ని సీన్లు నవ్విస్తాయి. అలా కాని పక్షంలో ఇదొక సిల్లీ సినిమాగా అనిపించే అవకాశమూ ఉంది. ‘కొబ్బరిమట్ట’ ఎవరికెలాంటి అనుభూతిని కలిగిస్తుందన్నది వాళ్ల అభిరుచిని బట్టి ఉంటుంది. ఐతే ఈ సినిమాకు లిమిటేషన్స్ ఏమీ లేవు కాబట్టి.. లాజిక్కులతో సంబంధం లేకుండా ఏమైనా రాసే.. తీసే అవకాశం ఉన్నపుడు రచయిత.. దర్శకుడు ఇంకొంచెం ఎక్స్ ట్రీమ్ గా వెళ్లడానికి అవకాశం ఉండి కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. పేరడీ చేయాలనుకున్నపుడు ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘పెదరాయుడు’ను కాకుండా గత కొన్నేళ్లలో వచ్చిన ఏ ‘బాహుబలి’ లంటి సినిమాలనో టార్గెట్ చేసుకుని ఉంటే ఇప్పటి ప్రేక్షకులు మరింత కనెక్టవ్వడానికి అవకాశం ఉండేది. ‘జబర్దస్త్’ లాంటి ప్రోగ్రామ్స్ లో బోలెడన్ని స్పూఫులు.. పేరడీలు చూస్తున్న నేపథ్యంలో ఇలాంటి కొన్ని స్కిట్లు కలిపినట్లుగా ఉండే ‘కొబ్బరిమట్ట’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న సందేహాలూ లేకపోలేదు. కాకపోతే ఇక్కడ సంపూ ఉన్నాడు కాబట్టి అతడి మార్కు వినోదాన్ని చూడాలనుకునేవాళ్లు ‘కొబ్బరిమట్ట’పై ఓ లుక్కేయొచ్చు.

నటీనటులు: సంపూను అభినందించాల్సిందే. మూడున్నర నిమిషాల పాటు నిర్విరామంగా చెప్పిన డైలాగ్ దగ్గర కావచ్చు.. వరుణుడిని కరిగించేందుకు గజ్జె కట్టి నృత్యం చేసే చోట కావచ్చు.. ‘అఆఇఈ’ పాటలో స్టార్ హీరోలకు దీటుగా స్టెప్స్ వేయడంలో కావచ్చు.. అతను తన వంతుగా బాగానే ఎంటర్టైన్ చేశాడు. దాని వెనుక అతడి కష్టాన్ని కూడా అభినందించాల్సిందే. సినిమాను దాదాపుగా తన భుజాల మీద నడిపించాడు సంపూ. మహేష్ కత్తి.. షకీలా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులూ వారి పరిధిలో బాగానే చేశారు.

సాంకేతికవర్గం: టెక్నీషియన్స్ అందరూ సినిమా థీమ్ కు తగ్గ ఔట్ పుట్ ఇచ్చారు. కమ్రాన్ పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. ‘అఆఇఈ’ కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ముజీర్ మాలిక్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు అంత గొప్పగా అనిపించవు కానీ.. ఈ చిత్రానికి ఉన్న పరిమితుల దృష్ట్యా మన్నించొచ్చు. సాయిరాజేష్ (స్టీవెన్ శంకర్) కథ.. స్క్రీన్ ప్లే అంతా మామూలే కానీ.. డైలాగులు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. సినిమాకు అతి పెద్ద బలం అవే. అతను రాసిన కామెడీ ఎపిసోడ్లు కొన్ని బాగానే పేలాయి. దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్.. పర్వాలేదనిపించాడు.
చివరగా: కొబ్బరిమట్ట.. ఇది సంపూ ‘జబర్దస్త్’

రేటింగ్- 2.25/5

Spread the love